Indian Revised Version — Telugu (2019)
యోహాను రాసిన ప్రకటన గ్రంథం 8
1ఆయన ఏడవ సీలు తెరిచినప్పుడు పరలోకంలో దాదాపు అరగంట సేపు నిశ్శబ్దం అలుముకుంది. 2అప్పుడు నేను దేవుని సమక్షంలో నిలబడే ఏడుగురు దేవదూతలను చూశాను. వారికి ఏడు బాకాలు ఇచ్చారు. 3మరో దూత ధూపం వేసే బంగారు పాత్ర చేత్తో పట్టుకుని వచ్చి బలిపీఠం ముందు నిలుచున్నాడు. సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠంపై పరిశుద్ధుల ప్రార్థనలతో కలపడానికి చాలా పరిమళ సాంబ్రాణి అతనికి ఇచ్చారు. 4అప్పుడు ఆ దూత చేతిలో నుండి పరిమళ వాసనలు, సాంబ్రాణి పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలసి పైకి లేచి దేవుని సమక్షంలోకి వెళ్ళాయి. 5ఆ దూత ధూపం వేసే పాత్రను తీసుకుని, బలిపీఠం పైన ఉన్న నిప్పు కణికలతో దాన్ని నింపి భూమి మీదికి విసిరి వేశాడు. అప్పుడు గర్జనలాంటి శబ్దాలూ, ఉరుములూ, మెరుపులూ, భూకంపమూ కలిగాయి. 6అప్పుడు ఏడు బాకాలు పట్టుకున్న ఆ ఏడుగురు దూతలు వాటిని ఊదడానికి సిద్ధం అయ్యారు. 7మొదటి దూత బాకా ఊదినప్పుడు రక్తంతో కలసిన వడగళ్ళూ నిప్పూ భూమి మీద కురిశాయి. దాని మూలంగా భూమి మీద మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం తగలబడి పోయాయి. పచ్చగడ్డి అంతా తగలబడిపోయింది. 8రెండవ దూత బాకా ఊదినప్పుడు భగభగ మండుతూ ఉన్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో మూడవ భాగం రక్తం అయిపోయింది. 9సముద్రంలోని ప్రాణుల్లో మూడవ భాగం చచ్చిపోయాయి. ఓడల్లో మూడోభాగం నాశనం అయ్యాయి. 10మూడవ దూత బాకా ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం కాగడాలాగా మండిపోతూ ఆకాశం నుండి రాలిపోయింది. అది భూమి మీద ఉన్న నదుల్లో మూడవ భాగం పైనా, నీటి ఊటల పైనా పడింది. 11ఆ నక్షత్రం పేరు “చేదు.” కాబట్టి నీళ్ళలో మూడవ భాగం చేదై పోయాయి. నీళ్ళు చేదై పోవడం వల్ల దాని మూలంగా చాలా మంది చచ్చిపోయారు. 12నాలుగవ దూత బాకా ఊదినప్పుడు సూర్యుడిలో మూడవ భాగం, చంద్రుడిలో మూడోభాగం, నక్షత్రాల్లో మూడవభాగం దెబ్బ తిన్నాయి. కాబట్టి వాటిలో మూడోభాగం కాంతి విహీనం అయ్యాయి, చీకటిగా మారాయి. దాంతో పగలు మూడవ భాగం, రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది. 13తరువాత ఆకాశంలో ఎగురుతున్న ఒక పెద్ద డేగను నేను చూశాను. అది ఎగురుతూ “ఇంకా బాకాలు ఊదబోతున్న మిగిలిన ముగ్గురు దేవదూతల బాకా శబ్దాలను బట్టి భూమిపై నివసించే వారికి అయ్యో, ఎంత యాతన, ఎంత యాతన, ఎంత యాతన!” అంటూ బిగ్గరగా అరుస్తుంటే విన్నాను.
This chapter is not in this version.
Keep going
Indian Revised Version — Telugu (2019). Indian Revised Version (Telugu), Bridge Connectivity Solutions, CC BY-SA 4.0, via eBible.org. Inline cross-reference notes removed..