Skip to content

Indian Revised Version — Telugu (2019)

సంఖ్యాకాండం 18

1యెహోవా అహరోనుతో “పవిత్ర స్థలంలో సేవలో జరిగే పాపాలకు నువ్వూ, నీ కొడుకులూ, నీ వంశం జవాబుదారులు. నువ్వూ, నీ కొడుకులూ మీ యాజకత్వపు పాపాలకు జవాబుదారులు. 2ఇంకా, నీ తండ్రి గోత్రం, అంటే లేవీ వంశస్తులైన నీ సహోదరులను నువ్వు దగ్గరికి తీసుకు రావాలి. నువ్వూ నీ కొడుకులూ నిబంధన శాసనాల గుడారం ఎదుట పరిచర్య చేస్తున్నప్పుడు వారు నీతో కలిసి నీకు సాయం చేస్తారు. 3వారు నీకూ, గుడారం అంతటికీ సేవ చెయ్యాలి. కాని వారూ, మీరూ చనిపోకుండా ఉండాలంటే వారు పవిత్ర స్థలపు ఉపకరణాల దగ్గరకైనా, బలిపీఠం దగ్గరకైనా రాకూడదు. 4వారు నీతో కలిసి సన్నిధి గుడారంలోని సేవంతటి విషయంలో శ్రద్ధ వహించాలి. 5ఒక బయటి వాడు మీ దగ్గరికి రాకూడదు. ఇకముందు ఇశ్రాయేలీయుల మీదకి నా కోపం రాకుండా ఉండాలంటే మీరు పవిత్రస్థలం పట్ల, బలిపీఠం పట్ల బాధ్యత వహించాలి. 6చూడండి, ఇశ్రాయేలీయుల మధ్య నుంచి లేవీయులైన మీ సహోదరులను నేనే ఎంపిక చేసుకున్నాను. సన్నిధి గుడారపు సేవ చెయ్యడానికి వారిని యెహోవా కోసం మీకు ఒక బహుమానంగా ఇచ్చాను. 7కాని నువ్వూ, నీ కొడుకులు మాత్రమే బలిపీఠానికీ, అడ్డతెర లోపల ఉన్న వాటికీ సంబంధించిన పనులన్నిటి విషయంలో యాజకత్వం జరుపుతూ సేవ చెయ్యగలరు. కేవలం మీరు మాత్రమే ఈ బాధ్యతలు చేపట్టగలరు. ఈ యాజకత్వాన్ని మీకు ఒక బహుమానంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా దాన్ని సమీపిస్తే అతనికి మరణ శిక్ష విధించాలి” అన్నాడు. 8ఇంకా యెహోవా అహరోనుతో “చూడు, ఇశ్రాయేలీయులు నాకు తెచ్చే కానుకలు, పవిత్ర అర్పణల బాధ్యత నీకిచ్చాను. ఈ అర్పణల్లో నీకూ, నీ కొడుకులకూ శాశ్వతంగా భాగం దక్కుతుంది. 9అతి పవిత్రమైన వాటిలో అగ్నిలో పూర్తిగా కాలనివి నీకు చెందుతాయి. వారి నైవేద్యాలన్నిట్లో, వారి పాప పరిహారార్థ బలులన్నిట్లో, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిట్లో, వారు నాకు చెల్లించే పవిత్ర అర్పణలన్నీ నీకు, నీ కొడుకులకూ చెందుతాయి. మీరు వాటిని అతి పవిత్రమైనవిగా ఎంచి తినాలి. 10మీలో ప్రతి మగవాడు ఈ అర్పణలు తినాలి. అవి నాకు ప్రత్యేకించిన అర్పణలుగా మీరు పరిగణించాలి. 11ఇంకా వారి దానాల్లో ప్రతిష్టించిందీ, ఇశ్రాయేలీయులు అల్లాడించే అర్పణలన్నీ నీకు చెందుతాయి. నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా నేను మీకిచ్చాను. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు. 12వారు యెహోవాకు అర్పించే మొదటి ఫలాలు, అంటే, నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షారసం, ధాన్యాల్లో ప్రశస్తమైనవన్నీ నీకిచ్చాను. 13వారు తమ దేశపు పంటలన్నిట్లో యెహోవాకు తెచ్చే మొదటి ఫలాలు నీకు చెందుతాయి. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు. 14ఇశ్రాయేలీయులు ప్రతిష్ట చేసిన ప్రతిదీ నీకు చెందుతుంది. 15మనుష్యుల్లోగాని, పశువుల్లోగాని, వారు యెహోవాకు అర్పించే ప్రాణులన్నిట్లో ప్రతి తొలిచూలు నీకు చెందుతుంది. అయితే, ప్రజలు తొలిచూలు మగబిడ్డను వెల చెల్లించి తిరిగి సంపాదించుకోవాలి. 16అపవిత్ర పశువుల తొలిచూలు మగపిల్లను వెల చెల్లించి మళ్ళీ కొనుక్కోవాలి. వెల చెల్లించి మళ్ళీ కొనుక్కోవాల్సిన వాటిని పుట్టిన నెల రోజులకు నువ్వు నియమించిన వెల ప్రకారం పవిత్ర మందిరపు తూకంతో ఐదు తులాల వెండి ఇచ్చి వాటిని తిరిగి కొనుక్కోవాలి. అంటే 55 గ్రాములు. 17కాని ఆవు తొలి చూలుని, గొర్రె తొలి చూలుని, మేక తొలి చూలుని విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తం నువ్వు బలిపీఠం మీద పోసి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా వాటి కొవ్వును కాల్చాలి. కాని వాటి మాంసం నీకు చెందుతుంది. 18అల్లాడించే అర్పణగా ఉన్న బోర, కుడి జబ్బ, నీదైనట్టు అది కూడా నీకు చెందుతుంది. 19ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్రమైన ప్రతిష్ఠార్పణలన్నీ నేను నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా ఇచ్చాను. అది నీకూ, నీతో పాటు నీ సంతానానికీ యెహోవా సన్నిధిలో స్థిరమైన శాశ్వత నిబంధన” అన్నాడు. 20ఇంకా యెహోవా అహరోనుతో “ప్రజల భూమిలో నీకు స్వాస్థ్యం ఉండకూడదు. వారి మధ్య నీకు ఆస్తిగాని భాగం గాని ఉండకూడదు. ఇశ్రాయేలీయుల మధ్య నీ భాగం, నీ స్వాస్థ్యం నేనే. 21చూడు, లేవీయులు చేసే సేవకు, అంటే, సన్నిధి గుడారపు సేవకు ప్రతిగా నేను ఇశ్రాయేలీయుల పదోవంతును వాళ్లకు వారసత్వంగా ఇచ్చాను. 22ఇశ్రాయేలీయులు ఇకముందు సన్నిధి గుడారం దగ్గరికి రాకూడదు. అలా చేస్తే ఆ పాపం కారణంగా చనిపోతారు. 23అయితే లేవీయులు సన్నిధి గుడారం సేవ చేసి, వారి సేవలో పాపాలకు వారే జవాబుదారులుగా ఉంటారు. మీ ప్రజల తరతరాలకు ఇది శాశ్వతమైన శాసనం. ఇశ్రాయేలీయుల మధ్య వాళ్లకు ఏ స్వాస్థ్యం ఉండకూడదు. 24అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణగా అర్పించే పదోవంతు భాగాలు నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాను. అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యం సంపాదించకూడదని వారితో చెప్పాను” అన్నాడు. 25ఇంకా యెహోవా మోషేతో, 26“నువ్వు లేవీయులతో ఇలా చెప్పు, ‘నేను ఇశ్రాయేలీయుల ద్వారా మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన పదోవంతు భాగాలు మీరు వారి దగ్గర తీసుకున్నప్పుడు మీరు దానిలో, అంటే ఆ పదోవంతు భాగంలో పదోవంతు భాగం యెహోవాకు ప్రతిష్ఠార్పణగా చెల్లించాలి. 27మీకు వచ్చే ప్రతిష్ఠార్పణను కళ్లపు పంటలా, ద్రాక్షల తొట్టి ఫలంలా ఎంచాలి. 28ఆ విధంగా మీరు ఇశ్రాయేలీయుల దగ్గర పొందిన మీ పదోవంతు భాగాలు అన్నిట్లోనుంచి మీరు ప్రతిష్ఠార్పణ యెహోవాకు చెల్లించాలి. దానిలోనుంచి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణ యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. 29మీరు పొందిన బహుమానాల్లో ప్రశస్తమైన వాటిలోనుంచి యెహోవాకు శ్రేష్ఠమైన అర్పణ ఇవ్వాలి.’ 30ఇంకా నువ్వు వారితో, మీరు పొందిన వాటిలో నుంచి ప్రశస్తభాగం అర్పించినప్పుడు, లేవీయులు దాన్ని కళ్ళం నుంచీ, ద్రాక్షగానుగ నుంచీ వచ్చిన ఫలంలా పరిగణించాలి. 31మీరూ, మీ కుటుంబాలూ ఏ స్థలంలోనైనా వాటిని తినొచ్చు. ఎందుకంటే సన్నిధి గుడారంలో మీరు చేసే సేవకు అది మీకు జీతం. 32మీరు పొందిన వాటిలోనుంచి ప్రశస్తమైనవి యెహోవాకు అర్పించి ఉంటే, దాన్ని తిని, తాగినందుకు మీకు ఏ పాపశిక్ష ఉండదు. మీరు చనిపోకుండా ఉండాలంటే ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రం చెయ్యకూడదని చెప్పు” అన్నాడు.

Keep going

Indian Revised Version — Telugu (2019). Indian Revised Version (Telugu), Bridge Connectivity Solutions, CC BY-SA 4.0, via eBible.org. Inline cross-reference notes removed..

Books

✦ Explain this verse with AI AI explanations, Bible Q&A, characters, maps and more — in the Truth of Bible app →

Reading settings

Theme
Text size
100%
Layout

Loading the Bibles…

Your choice is remembered on this device and used for reading, search and the verse screen.