Skip to content

Indian Revised Version — Telugu (2019)

లేవీకాండం 26

1“మీరు విగ్రహాలను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గానీ దేవతా రాతి స్తంభాన్ని గానీ నిలబెట్టకూడదు. మీ దేశంలో మీరు మొక్కడానికి చెక్కిన రాతి బొమ్మను నిలబెట్టకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. 2నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని పవిత్రంగా చూడాలి. నేను యెహోవాను. 3మీరు నా శాసనాలను బట్టి నడుచుకుంటూ నా ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అనుసరించి ప్రవర్తించాలి. 4వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను. మీ భూమి పంటలనిస్తుంది. మీ పొలాల్లో చెట్లు ఫలిస్తాయి. 5మీ ద్రాక్ష పండ్లకాలం వరకూ మీ పంట నూర్పు కొనసాగుతుంది. మీరు తృప్తిగా తిని మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు. 6ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగిస్తాను. మీరు పండుకొనేటప్పుడు ఎవరూ మిమ్మల్ని భయపెట్టరు. ఆ దేశంలో క్రూరమృగాలు లేకుండా చేస్తాను. మీ దేశంలోకి ఖడ్గం రాదు. 7మీరు మీ శత్రువులను తరుముతారు. వారు మీ ఎదుట కత్తివాత కూలుతారు. 8మీలో ఐదుగురు వంద మందిని తరుముతారు. వంద మంది పదివేల మందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట కత్తివాత కూలిపోతారు. 9ఎందుకంటే నేను మిమ్మల్ని కరుణించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థిరపరుస్తాను. 10మీరు చాలా కాలం నిలవ ఉన్న పాత ధాన్యం తింటారు. కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉంటుంది. 11నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మీ విషయం నా మనస్సు అసహ్యపడదు. 12నేను మీ మధ్య సంచరిస్తాను. మీకు దేవుడినై ఉంటాను. మీరు నాకు ప్రజలై ఉంటారు. 13మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశంలోనుండి మిమ్మల్ని రప్పించాను. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి అడ్డకొయ్యలు విరగగొట్టి మిమ్మల్ని తలెత్తుకుని నడిచేలా చేశాను. 14ఒకవేళ మీరు నా మాట వినకుండా నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా 15నా శాసనాలను నిరాకరిస్తూ, నా ఆజ్ఞలన్నిటినీ నిరాకరిస్తూ నా నిబంధనను ఉల్లంఘిస్తూ నా తీర్పులను త్రోసిపుచ్చుతూ ఉంటారేమో. 16అలాగైతే నేను మీకు చేసేది ఇదే. మీమీదికి భయం రప్పిస్తాను. మీకు జ్వరం కలిగించి మీ కళ్ళు దెబ్బ తిని ప్రాణాలు నీరసించి పోయేలా చేస్తాను. మీరు చల్లిన విత్తనాలు వ్యర్థమైపోతాయి. మీ శత్రువులు వాటి పంటను తింటారు. 17మీ నుండి ముఖం తిప్పేసుకుంటాను. మీ శత్రువులు మిమ్మల్ని లోబరచుకుంటారు. మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్ని పరిపాలిస్తారు. ఎవరూ తరమకపోయినా మీరు పారిపోతారు. 18నా ఆజ్ఞలు పాటించకపోతే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను. 19మీ బల గర్వాన్ని భంగపరచి, ఆకాశాన్ని ఇనుములాగా భూమిని ఇత్తడిలాగా చేస్తాను. 20మీ భూమి ఫలించదు. మీ దేశంలోని చెట్లు ఫలించవు. మీ బలం వృథాగా ఇంకి పోతుంది. 21మీరు నా మాట వినకుండా నాకు విరోధంగా నడిస్తే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధిస్తాను. 22మీ మధ్యకు క్రూరమృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను ఎత్తుకుపోతాయి. మీ పశువులను నాశనం చేస్తాయి. మిమ్మల్ని కొద్ది మందిగా చేస్తాయి. మీ దారులు నిర్మానుష్యమై పోతాయి. 23ఇంత చేసినా మీరు నాకు విరోధంగా నడుస్తూ ఉంటే 24నేను కూడా మీపై కోపంగా నడుచు కుంటాను. నేనే మీ పాపాలను బట్టి ఇంకా ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను. 25మీ మీదికి కత్తి రప్పిస్తాను. అది నా నిబంధన విషయం ప్రతి దండన చేస్తుంది. మీరు మీ పట్టణాల్లో సమకూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పిస్తాను. మీరు శత్రువుల వశమైపోతారు. 26నేను మీ ఆహారాన్ని, అంటే మీ ప్రాణాధారం తీసేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు రొట్టెలు చేసి కొలత ప్రకారం మీకు ఇస్తారు. మీరు తింటారు గాని తృప్తి పొందరు. 27నేను ఇలా చేసిన తరువాత కూడా మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిస్తే 28నేను కోపపడి మీకు విరోధంగా నడుస్తాను. నేనే మీ పాపాలను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను. 29మీరు మీ కొడుకుల మాంసం తింటారు, మీ కుమార్తెల మాంసం తింటారు. 30నేను మీ ఉన్నత స్థలాలను పాడు చేస్తాను. మీ విగ్రహాలను ధ్వంసం చేస్తాను. మీ విగ్రహాల శవాలపై మీ శవాలను పడవేయిస్తాను. నా మనస్సులో మిమ్మల్ని అసహ్యించు కుంటాను. 31నేను మీ ఊళ్ళను పాడు చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాలను పాడుచేస్తాను. మీ సువాసన గల అర్పణలును వాసన చూడను. 32నేనే మీ దేశాన్ని పాడు చేసిన తరువాత దానిలో నివసించే మీ శత్రువులు దాన్ని చూసి ఆశ్చర్యపడతారు. 33జనాల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి కత్తి దూసి మీ వెంటబడి తరుముతాను. మీ దేశం పాడైపోతుంది, మీ ఊళ్లు పాడుబడిపోతాయి. 34మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడుబడి ఉన్న కాలమంతా అది తన విశ్రాంతి కాలాలను అనుభవిస్తుంది. 35అది పాడై ఉండే దినాలన్నీ విశ్రాంతి తీసుకుంటుంది. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందలేకపోయిన విశ్రాంతిని అది పాడై ఉన్న దినాల్లో అనుభవిస్తుంది. 36మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశాల్లో ఉండగా వారి హృదయాల్లో అధైర్యం పుట్టిస్తాను. గాలికి కొట్టుకుపోతున్న ఆకు చప్పుడుకు వారు పారిపోతారు. ఖడ్గం నుండి తప్పించుకోడానికి పారిపోతున్నట్టు వారు ఆ చప్పుడు విని పారిపోతారు. తరుమేవాడు ఎవరూ లేకుండానే పడిపోతారు. 37తరిమేవాడు ఎవరూ లేకుండానే వారు కత్తిని చూసినట్టుగా ఒకడి మీద ఒకడు పడతారు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేక పోతారు. 38మీరు జనంగా ఉండకుండాా నశించి పోతారు. మీ శత్రువుల దేశం మిమ్మల్ని తినేస్తుంది. 39మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశాల్లో తమ దోషాలను బట్టి క్షీణించిపోతారు. వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషాలను బట్టి క్షీణించిపోతారు. 40వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషాన్ని, తమ తండ్రుల దోషాన్ని ఒప్పుకుని, తాము నాకు విరోధంగా నడిచామని, 41నేను వారికి విరోధంగా నడిచానని, తమ శత్రువుల దేశంలోకి తమ్మును రప్పించాననీ ఒప్పుకుంటే, అంటే లోబడని తమ హృదయాలు లొంగి తాము చేసిన దోషానికి ప్రతి దండన అనుభవించామని ఒప్పుకుంటే, 42నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఆ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాను. 43తమ దేశాన్ని వారు విడిచిపెట్టి పోగా పాడైపోయిన వారి దేశం తన విశ్రాంతి దినాలను అనుభవిస్తుంది. వారు నా తీర్పులను తిరస్కరించి నా శాసనాలను అసహ్యించుకున్నారు. ఆ కారణం చేతనే వారు తమ పైకి వచ్చిన దోషశిక్ష న్యాయమని ఒప్పుకొంటారు. 44అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరించను. నా నిబంధనను భంగపరచి వారిని బొత్తిగా నశింపజేయడానికి వారిపై అసహ్యపడను. ఎందుకంటే నేను వారి దేవుడైన యెహోవాను. 45నేను వారికి దేవుడనై ఉండేలా వారి పూర్వికులను వివిధ జాతులు చూస్తుండగా ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులను బట్టి జ్ఞాపకం చేసుకుంటాను. నేను యెహోవాను, అని చెప్పు” అన్నాడు. 46యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకు, ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన శాసనాలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే.

Keep going

Indian Revised Version — Telugu (2019). Indian Revised Version (Telugu), Bridge Connectivity Solutions, CC BY-SA 4.0, via eBible.org. Inline cross-reference notes removed..

Books

✦ Explain this verse with AI AI explanations, Bible Q&A, characters, maps and more — in the Truth of Bible app →

Reading settings

Theme
Text size
100%
Layout

Loading the Bibles…

Your choice is remembered on this device and used for reading, search and the verse screen.