Skip to content

Indian Revised Version — Telugu (2019)

యిర్మీయా 17

1యూదా పాపం వజ్రపు కొన ఉన్న ఇనుప కలంతో రాసి ఉంది. అది వారి హృదయాలు అనే పలకల మీద, మీ బలిపీఠాల కొమ్ముల మీద చెక్కి ఉంది. 2వారి ప్రజలకు ఎత్తయిన కొండల మీదున్న తమ బలిపీఠాలూ పచ్చని చెట్ల కిందున్న అషేరా దేవతా స్థంభాలూ గుర్తే. 3సరిహద్దుల్లోని పర్వతాల మీదున్న వారి బలిపీఠాలు వారికి గుర్తే. నీ ఆస్తిని, నీ నిధులన్నిటిని దోపుడు సొమ్ముగా నేనప్పగిస్తాను. మీ పాపం మీ దేశమంతా ఉంది. 4నేను నీకిచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. మీరు నా కోపాగ్ని రగులబెట్టారు. అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది. నీవెరుగని దేశంలో నీ శత్రువులకు నువ్వు బానిసవవుతావు. 5యెహోవా ఇలా సెలవిస్తున్నాడు “మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు బలంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీదనుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. 6వాడు ఎడారిలోని పొదలాగా ఉంటాడు. వాడికి ఏ మేలూ కనబడదు. వాడు ఎడారిలో రాళ్ళ మధ్య, చవిటి భూమిలో నిర్జన ప్రాంతంలో నివసిస్తాడు. 7అయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు. 8వాడు నీళ్ళ ఊట దగ్గర చెట్టులాగా ఉంటాడు. దాని వేళ్ళు చుట్టుపక్కలా వ్యాపిస్తాయి. ఎండ వచ్చినా దానికి చలనం ఉండదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. కరువు కాలాల్లో కంగారు పడదు. కాపు మానదు. 9హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు? 10నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను. 11కౌజుపిట్ట తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది. ఎవడైనా అక్రమంగా ఆస్తి సంపాదించుకోగలడు. అయితే తన ఉచ్ఛదశలో ఆ ఆస్తి వాణ్ణి వదిలేస్తుంది. చివరికి వాడు తెలివితక్కువవాడని తేలుతుంది.” 12మొదటి నుంచి మా దేవాలయ స్థలం ఘనమైన సింహాసనం లాంటిది. 13యెహోవాయే ఇశ్రాయేలుకు ఆశాభావం. నిన్ను విడిచిపెట్టే వాళ్ళంతా సిగ్గుపాలవుతారు. దేశంలో నీనుంచి దూరమైన వాళ్ళతో సంబంధం తెగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు యెహోవా అనే జీవజలాల ఊటను వదిలేశారు. 14యెహోవా, నన్ను బాగు చెయ్యి. నేను బాగుపడతాను! నన్ను కాపాడు. నేను క్షేమంగా ఉంటాను. నువ్వే నా స్తుతి పాట. 15వాళ్ళు “యెహోవా వాక్కు ఎక్కడుంది? దాన్ని రానివ్వు” అంటున్నారు. 16నేను నిన్ను అనుసరిస్తూ కాపరిగా ఉండడం మానలేదు. విపత్తుదినం కోసం నేను ఎదురు చూడలేదు. నా నోట నుంచి వచ్చిన మాటలు నీకు తెలుసు. అవి నీ దగ్గరనుంచే వచ్చాయి. 17నువ్వు నాకు భయకారణంగా ఉండవద్దు. విపత్తు రోజున నువ్వే నా ఆశ్రయం. 18నన్ను తరిమేవాళ్ళు సిగ్గుపడాలి, కానీ నన్ను సిగ్గుపడనివ్వొద్దు. నన్ను దిగులు పడనివ్వక వాళ్ళను దిగులు పడనివ్వు. వాళ్ళ మీదికి ఆపద రోజులు రప్పించు. రెట్టింపు నాశనం వాళ్ళ మీదికి రప్పించు. 19యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు వెళ్లి యూదా రాజులు వచ్చిపోయే కోట గుమ్మంలో, ఆ తర్వాత యెరూషలేము ద్వారాలన్నిటిలో నిలబడు. 20వారితో ఇలా చెప్పు, యూదా రాజులారా! యూదా ప్రజలారా! యెరూషలేము నివాసులారా! ఈ ద్వారాలగుండా ప్రవేశించే మీరంతా యెహోవా మాట వినండి. 21యెహోవా చెప్పేదేమిటంటే, మీరు జాగ్రత్తగా ఉండి విశ్రాంతి దినాన బరువులు మోయవద్దు. యెరూషలేము ద్వారాలగుండా వాటిని తీసుకు రావద్దు. 22విశ్రాంతి దినాన మీ ఇళ్ళలోనుంచి బరువులు మోసుకుపోవద్దు. మరి ఏ పనీ చేయవద్దు. నేను మీ పూర్వీకులకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పవిత్ర దినంగా ఆచరించండి. 23అయితే వాళ్ళు వినలేదు, శ్రద్ధ వహించలేదు. తలబిరుసుగా ఉండి నా మాట వినక, క్రమశిక్షణ పాటించలేదు.” 24యెహోవా ఇలా చెప్పాడు. “మీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతి దినాన మరే పనీ చేయక దాన్ని పవిత్ర దినంగా ఆచరించండి. విశ్రాంతి దినాన ఈ పట్టణపు ద్వారాల గుండా బరువులు తీసుకు రాకండి. 25అప్పుడు దావీదు సింహాసనమెక్కే రాజులూ అధిపతులూ ఈ నగర ద్వారాలగుండా ప్రవేశిస్తారు. రథాల మీదా గుర్రాల మీదా ఎక్కి తిరిగే రాజులూ అధిపతులూ యూదావారూ యెరూషలేము నివాసులూ వస్తారు. ఈ పట్టణం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 26ప్రజలు దహనబలులనూ బలులనూ నైవేద్యాలనూ ధూపద్రవ్యాలనూ స్తుతియాగ ద్రవ్యాలనూ నా మందిరానికి తెస్తారు. వాళ్ళు యూదా పట్టణాల్లో నుంచి, యెరూషలేము ప్రాంతాల్లో నుంచి, బెన్యామీను దేశంలో నుంచి, మైదాన ప్రాంతంలో నుంచి, కొండసీమ నుంచి, దక్షిణ ప్రదేశం నుంచి వస్తారు. 27అయితే మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించి, ఆ దినాన బరువులు మోస్తూ యెరూషలేము ద్వారాల గుండా ప్రవేశించకూడదని నేను చెప్పిన మాట వినకపోతే నేను దాని ద్వారాల్లో మంట పెడతాను. అది రాజ భవనాలను కాల్చివేస్తుంది. దాన్ని ఆర్పడం ఎవరి తరమూ కాదు.”

Keep going

Indian Revised Version — Telugu (2019). Indian Revised Version (Telugu), Bridge Connectivity Solutions, CC BY-SA 4.0, via eBible.org. Inline cross-reference notes removed..

Books

✦ Explain this verse with AI AI explanations, Bible Q&A, characters, maps and more — in the Truth of Bible app →

Reading settings

Theme
Text size
100%
Layout

Loading the Bibles…

Your choice is remembered on this device and used for reading, search and the verse screen.