Skip to content

Indian Revised Version — Telugu (2019)

2 దినవృత్తాంతాలు 22

1యెరూషలేము నివాసులు యెహోరాము ఆఖరి కొడుకు అహజ్యాను అతనికి బదులు రాజుగా చేశారు. ఎందుకంటే, అరబీయులతో కూడ శిబిరం పైకి దండెత్తి వచ్చినవారు అతని పెద్దకొడుకులందరినీ చంపేశారు. ఈ విధంగా యూదారాజు యెహోరాము కొడుకు అహజ్యా రాజయ్యాడు. 2అహజ్యా పరిపాలన మొదలు పెట్టినప్పుడు 42 ఏళ్ల వయసులో యెరూషలేములో ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. 3దుర్మార్గంగా ప్రవర్తించడం అతని తల్లి అతనికి నేర్పిస్తూ వచ్చింది, కాబట్టి అతడు కూడా అహాబు ఇంటి వారి పద్ధతుల్లో నడిచాడు. 4అహాబు ఇంటివారు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత వారు అతనికి సలహాదారులుగా ఉండి అతని నాశనానికి కారణమయ్యారు. 5వారి సలహా ప్రకారమే అతడు కూడా ప్రవర్తించాడు. అతడు రామోతు గిలాదులో అరాము రాజు హజాయేలుతో యుద్ధం చేయడానికి అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాముతో కూడా వెళ్ళాడు. అరామీయులు యెహోరామును గాయపరిచారు. 6అరాము రాజు అయిన హజాయేలుతో తాను రమాలో చేసిన యుద్ధంలో తనకు తగిలిన గాయాలను బాగుచేసుకోడానికి అతడు యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అహాబు కొడుకు యెహోరాము గాయపడ్డాడని విని యూదా రాజు యెహోరాము కొడుకు అహజ్యా అతనిని చూడడానికి యెజ్రెయేలు వెళ్ళాడు. 7యెహోరాము దగ్గరికి అహజ్యా రావడం వలన దేవుడు అతనికి నాశనం కలిగించాడు. అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలం చేయడానికి యెహోవా అభిషేకించిన నింషీ కొడుకు యెహూ మీదికి అతడు యెహోరాముతో కలిసి వెళ్ళాడు. 8యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అతడు యూదావారి అధికారులనూ, అహజ్యాకు సేవచేస్తున్న అహజ్యా సోదరుల కొడుకులనూ చూసి వారిని చంపేశాడు. 9తరువాత అతడు అహజ్యా కోసం వెతికాడు. అతడు షోమ్రోనులో దాగి ఉంటే వారు అతణ్ణి పట్టుకుని యెహూ దగ్గరికి తీసుకువచ్చారు. వారు అతణ్ణి చంపిన తరువాత “ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కొడుకు గదా” అనుకుని అతణ్ణి పాతిపెట్టారు. కాబట్టి రాజ్యమేలడానికి అహజ్యా ఇంట్లో ఎవరూ లేకుండా పోయారు. 10అహజ్యా తల్లి అతల్యా తన కొడుకు చనిపోయాడని విని, యూదావారి సంబంధులైన రాజ వంశస్తులందరినీ చంపేసింది. 11అయితే రాజైన యెహోరాము కుమార్తె యెహోషబతు అహజ్యా కొడుకు యోవాషును, మరణమైన రాకుమారుల్లోనుండి రహస్యంగా తెచ్చి, అతనిని, అతని దాదిని ఒక పడకగదిలో దాచింది. యెహోరాము రాజు కుమార్తె, యెహోయాదా అనే యాజకుని భార్య యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతణ్ణి దాచిపెట్టింది గనక అతల్యా ఆ పసివాణ్ణి చంపలేకపోయింది. ఈ యెహోషబతు అహజ్యాకు సోదరి. 12ఆరు సంవత్సరాలు అతణ్ణి వారితో కూడా దేవుని మందిరంలో దాచారు. అప్పుడు అతల్యా దేశాన్ని పరిపాలించింది.

Keep going

Indian Revised Version — Telugu (2019). Indian Revised Version (Telugu), Bridge Connectivity Solutions, CC BY-SA 4.0, via eBible.org. Inline cross-reference notes removed..

Books

✦ Explain this verse with AI AI explanations, Bible Q&A, characters, maps and more — in the Truth of Bible app →

Reading settings

Theme
Text size
100%
Layout

Loading the Bibles…

Your choice is remembered on this device and used for reading, search and the verse screen.